ప్రయోక్త :- నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., జాయింట్ కలెక్టర్లు, నోడల్ అధికారులతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఏర్పాట్ల సన్నద్ధతపై సమీక్షా, సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహనకు ఏర్పాట్లు చేశారు? పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారా..? పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలించారా..? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం పోలింగ్ కేంద్రంలో డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 7.00 నుంచి రాత్రి 7.00 వరకూ పోలింగ్ జరుగుతున్నందున.., లైటింగ్ సదుపాయం తప్పక ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లిస్టు తయారు చేయాలని, ఆ పోలింగ్ కేంద్రంలో ఇంటర్నెట్ సదుపాయం, లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు కచ్చితంగా చేయాలన్నారు. నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి అందించాల్సిన పోస్టల్ బ్యాలెట్ల తయారీ, పంపిణీపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ విధుల్లో ఉన్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తప్పక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ తేదీ కన్నా 5 రోజుల ముందే ఓటర్ స్లిప్పుల పంపిణీ చేయాలని, పంపిణీ కాని స్పిప్పులను బి.ఎల్.ఓకి అప్పగించి.., పోలింగ్ రోజున బి.ఎల్.ఓ పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్.., ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక అమలయ్యేలా టీంలు ఏర్పాటు చేయాలన్నారు. పి.ఓలు, ఎ.పి.ఓ లకు ఈవీఎం మిషన్ల ద్వారా పోలింగ్ నిర్వహణ, నూతన ఎన్నికల నిబంధనలపై శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి తప్పని సరిగా ఐడీ కార్డు అందించాలని, వారికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని, పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారులను కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు ఆదేశించారు. ఈ సమీక్షా, సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా.ఎన్. ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) టి.బాపిరెడ్డి, ఎ.సి.పి. వెంకటరత్నం, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
0 కామెంట్‌లు