ప్రయోక్త :-      నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్    కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., 22.3.21  సోమవారం ఉదయం రాజకీయ పార్టీల ప్రతినిధులతో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ పై సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 23.02.2021న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని.., 30.03.2021 తేదీ  వరకూ నామినేషన్లు దాఖలు చేయడానికి అనుమతి ఉందని జిల్లా కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. 31.03.2021 వ తేదీన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని.., 03.04.2021వ తేదీ లోపు నామినేషన్లు ఉప సంహరణకు అవకాశం ఉందన్నారు. 17.04.2021వ తేదీ ఉదయం 7.00 గం. నుంచి సాయంత్రం 7.00 గం. వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. 02.05.2021వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. కోవిడ్, వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్నికల సంఘం ఈ సారి.., అదనంగా రెండు గంటల పాటు పోలింగ్ సమయాన్ని పెంచిందని వెల్లడించారు.  నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆర్.ఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయవచ్చని, నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నియమావళి, కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. ఈసారి ఎన్నికల సంఘం అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించిందని, అభ్యర్థులు ఆన్ లైన్ లో కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మార్చి 16.02.2021 నుంచి 04.05.2021 వ తేదీ వరకూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలవుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ దృష్ట్యా పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1000 కి దాటకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయని.., అందువల్ల ఈసారి జిల్లాలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందన్నారు. 

సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో గతంలో 1163 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఇప్పుడు 1414 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లోక్ సభ ఉప ఎన్నికలు ఈవీఎం మిషన్ల ద్వారా జరుగుతున్నాయని, రాజకీయ పార్టీలు కూడా తమ ఏజెంట్లకు ఈవీఎం మిషన్ల ద్వారా జరిగే పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు. సి-విజిల్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఫిర్యాదులను స్వీకరిస్తుందని అని, సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలతో సహా ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనల గురించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు.., అవసరమైన చోట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరు నగరంలోని డి.కె.డబ్య్లూ కళాశాలలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం మిషన్ల స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పబ్లిక్ మీటింగ్ కి, ఎన్నికల ప్రచారానికి నిర్వహించే వెహికల్స్ కి తప్పక అనుమతి తీసుకోవాలని, రాత్రి 10.00 గం. నుంచి ఉదయం 6.00 గం. వరకూ పబ్లిక్ మీటింగ్స్, ఎన్నికల ప్రచారం, లౌడ్ స్పీకర్ల వాడకానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం క్యూలైన్లు, మార్కింగ్ ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహణకు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నోడల్ హెల్త్ అధికారి ఒకరిని నియమిస్తున్నామన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను జిల్లా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని, దీనికి రాజకీయ పార్టీలు ఎంతో సహకరించాయని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు తెలిపారు. లోక్ సభ ఉప ఎన్నికలు కూడా పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. 


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( రెవన్యూ)    హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ( ఆసరా)    టి.బాపిరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్  ఆర్.గోపాలకృష్ణ, మున్సిపల్ కమీషనర్     దినేష్ కుమార్, నాయుడుపేట ఆర్.డి.ఓ    సరోజిని, డి.ఆర్.డి.ఎ. పి.డి    సాంబశివారెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.