డిసెంబర్ 21 నాటికి గృహప్రవేశాలు జరగాలి కమిషనర్  హరిత

నవరత్నాలు పధకంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించే కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ 21 వ తేదీ నాటికి గృహ ప్రవేశాలు జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్  హరిత ఆదేశించారు. జగనన్న కాలనీల ప్రగతిపై ఇంజనీరింగ్, హౌసింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్    మాట్లాడుతూ గృహ నిర్మాణాలపై లబ్ధిదారులకు ప్రోత్సాహం కలిగించే దిశగా కొన్ని కాలనీల్లో అందమైన మోడల్ గృహాలను నిర్మించి ప్రదర్శనకు ఉంచాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, గృహ రుణాలను వేగవంతంగా మంజూరు చేయించాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ప్రస్తుతం బేస్ మెంట్ పూర్తయిన గృహాలు, స్లాబ్ పూర్తి చేసుకున్న గృహాల వివరాలను అడిగితెలుసుకున్న కమిషనర్ మౌలిక వసతుల కల్పనను కూడా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని కమిషనర్ ఆదేశించారు. 



గృహాలు మంజూరైన లబ్ధిదారులు కొంతమంది ప్రస్తుతానికి నగర పరిధిలో అందుబాటులో లేరని, వారిని సంప్రదించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో తాత్కాలికంగా స్థిరపడిన గృహాల లబ్ధిదారులకు సమాచారం అందించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజు, నగర పాలక సంస్థ ఎస్.ఈ సంపత్ కుమార్, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సెక్రటరీ హేమావతి,  హౌసింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.