సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శనీయం నెల్లూరు- మేయర్ పి.స్రవంతి
మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రజలందరికీ ఆదర్శనీయమని, ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమని నగర పాలక సంస్థ మేయర్ పి.స్రవంతి తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దివస్ రన్ ను సోమవారం ఉదయం స్థానిక కస్తూర్భా కళాక్షేత్రం నుంచి పటేల్ విగ్రహం వరకు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి 3కె యూనిటీ ర్యాలీని ప్రారంభించిన అనంతరం మేయర్ మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని భారత ప్రధమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకుంటున్నామని తెలిపారు. వివిధ సంస్థానాలు, రాజ్యాలుగా ఉన్న భారత దేశాన్ని ఐక్యం చేసి ప్రజాలందరిలో సోదరభావం పెంపొందించిన ఆదర్శవాది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించనున్నారని తెలిపారు. ఐక్యతా దినోత్సవం నాడు విద్యార్థులతో ఐక్యతా ప్రతిజ్ఞను చేయించడంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నారని మేయర్ తెలిపారు. ఈ ర్యాలీలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, కార్పొరేటర్ సత్తార్ బాషా, వివిధ పాఠశాలఎన్.సి.సి విద్యార్థులు, నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.