ప్రయోక్త:-  దేశంలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ప్రారంభమైన 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా.., నెల్లూరు నగరంలోని వి.ఆర్.కళాశాల మైదానంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ పాల్గొన్నారు. వి.ఆర్.కళాశాల మైదానంలో నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలకు సంబంధించి.., ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. రెడ్ క్రాస్ వైద్య సిబ్బందిచే కలెక్టర్, ఎస్పీ రక్త పరీక్షలు నిర్వహించుకున్నారు. ప్రతి స్టాల్ ని సందర్శించిన కలెక్టర్ వారు అందించిన సేవల గురించి ప్రశంశించారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనంట్ చిత్ర పటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్   కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., ప్రార్థించే పెదవులకన్నా, సాయం చేసే చేతులు మిన్న అని మథర్ థెరిస్సా చెప్పారని.., ఆ బోధనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే సేవాగుణాన్ని అలవర్చుకోవాలని, ఇతరులకు సహాయం చేస్తూ.., పెద్దవారికి కూడా ఆదర్శంగా నిలవాలని కోరారు. గత ఏడాది కాలం నుంచి కోవిడ్ మహమ్మారి వలన జిల్లాలోని ఎన్నో కుటుంబాలు.., మానసికంగా, ఆర్థికంగా, హెల్త్ పరంగా ఇబ్బంది పడ్డాయని.., ఇప్పటికీ ఆ మహమ్మారి పూర్తిగా పోలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. వారం రోజుల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది అని, అందువల్ల ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన విధి సేవ చేయడం అని.., సేవ యొక్క గొప్పతనానికి రెడ్ క్రాస్ సంస్థ ప్రతి రూపమని అన్నారు. రెడ్ క్రాస్ వాలంటీర్లు అందరూ సేవాదృక్పథాన్ని అలవర్చుకుని ప్రజలకు సేవలందించాలన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు కోవిడ్ సమయంలో ఎంతో ఉన్నతమైన సేవలందించారన్నారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను ఇంటి నుంచి ఆస్పత్రులకు తరలించడానికి, ఆస్పత్రుల్లో కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు సేవలందించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయానికి ముందుకు రాని పరిస్థితుల్లో కూడా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి సేవలు అందించారన్నారు. ప్లాస్మా దానంలో జిల్లా దేశంలోనే నంబర్ 2 లో ఉందని, రెడ్ క్రాస్ దీనిలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేశాక, ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో ధైర్యం నెలకొంది అని.., అవసరమైతే ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్మా ఇస్తారని నమ్మకం కలిగిందన్నారు. కోవిడ్ వలన మరణించిన వారి పార్థివదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి.., కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని సమయంలో జిల్లా కలెక్టర్ గా తన ఆదేశాలను గౌరవించి.., మంచి చేయడానికి రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. నివర్, బురేవి తుఫాన్ల సమయంలో 25,000 మంది ప్రజలను శిబిరాలకు తరలించి భోజనం అందించామని, ఆ సమయంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి సేవలందించారన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో రెడ్ క్రాస్ వాలంటీర్లు పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు, దివ్యాంగులకు ఓటింగ్ సమయంలో సేవలందించారని ప్రశంశించారు. 


ఈ కార్యక్రమంలో ఎస్పీ  భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ.., ఏడాది కాలం నుంచి రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలను చూస్తున్నానని.., కోవిడ్ సమయంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ..,  ఫ్రంట్ లైన్ వారియర్స్ లా రెడ్ క్రాస్ వాలంటీర్లు పనిచేశారని ప్రశంశించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ, అంతర్జాతీయంగా రెడ్ క్రాస్ ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తోందని, తమ సేవలను ఇలానే కొనసాగించాలని ఎస్పీ అన్నారు. 


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా)   టి.బాపిరెడ్డి మాట్లాడుతూ.., కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి సహకరిస్తూ, ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు రెడ్ క్రాస్ అందించిందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ.., ప్రజలకు సేవలందించాలని కోరారు. 


అనంతరం జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్.., దేశంలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ప్రారంభమైన 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా నెల్లూరు నుంచి విజయవాడ వరకూ రెడ్ క్రాస్ ప్రతినిధులు చేపట్టిన సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. రెడ్ క్రాస్ వాలంటీర్లతో కలిసి కలెక్టర్, ఎస్పీ సైకిల్ తొక్కుతూ ముందుకు సాగాతూ.., వాలంటీర్లలో ఉత్సాహాన్ని నింపారు.


ఈ కార్యక్రమంలో ఏపీ ఐ.ఆర్.సి.ఎస్. ఛైర్మన్  ఎ.శ్రీధర్, రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్  చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.